West Bengal: మమతా బెనర్జీకి కేంద్రం షాక్.. రాష్ట్రం పేరు మార్పుకు నో!

  • పేరు మార్పునకు నాలుగోసారీ రెడ్‌సిగ్నల్
  • పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్న కేంద్రం 
  • బంగ్లాదేశ్ పేరుకు ప్రతిపాదిత పేరు దగ్గరగా ఉండడంతో నిరాకరణ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్రం మరోమారు షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్‌ పేరును ‘బంగ్లా’గా మార్చాలంటూ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చి ప్రజల కోరికను నెరవేర్చాలంటూ మమత రాసిన లేఖను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఈ ప్రతిపాదనను తిరస్కరించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మారుస్తూ 2018లో మమత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అయితే, పేరు మార్పునకు అంగీకరించని కేంద్రం గతంలో మూడుసార్లు..1999, 2011, 2016లలో తిరస్కరించింది. తాజాగా నాలుగోసారి కూడా పేరు మార్పుకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, 26 జూలై 2018లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మారుస్తూ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. ఆ తర్వాత దానిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపింది. అయితే, బంగ్లాదేశ్ పేరుతో ప్రతిపాదిత పేరు ‘బంగ్లా’కు దగ్గరి పోలికలు ఉండడంతో కేంద్రం పేరు మార్పుకు నిరాకరించింది. పేర్లు ఒకేలా ఉండడం వల్ల అంతర్జాతీయ విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

More Telugu News