West Indies: అప్పట్లో ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్రగాయాలు... మళ్లీ బ్యాట్ పట్టి తానేంటో నిరూపించిన విండీస్ యువ సంచలనం

  • లంకతో మ్యాచ్ లో సెంచరీ చేసిన నికొలాస్ పూరన్
  • 2015లో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు
  • 7 నెలలు మంచానికే పరిమితం

గత వైభవం కోసం పరితపిస్తున్న ఇప్పటి వెస్టిండీస్ జట్టులో ప్రతిభకు లోటులేదు. శ్రీలంకతో చెస్టర్ లీ స్ట్రీట్ లో నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో చిచ్చరపిడుగల్లే సెంచరీ బాదిన యువ ఆటగాడు నికోలాస్ పూరన్ కూడా ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. లంకతో మ్యాచ్ లో విండీస్ స్వల్ప తేడాతో ఓడినా పూరన్ కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

నికొలాస్ పూరన్ భారత సంతతికి చెందిన ఆటగాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అంతకుముందు, 2015లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అతడి క్రికెట్ జీవితాన్ని అనిశ్చితిలో పడేసింది. పూరన్ రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. మళ్లీ లేచి నడవగలడా? అన్నంతగా గాయాలయ్యాయి. ఆ తర్వాత నడిచేందుకు 7 నెలలు పట్టింది. అది కూడా ఓ మనిషి పట్టుకుంటేనే! అయితే, క్రికెట్ ఆటపై ఉన్న తపన అతడ్ని మళ్లీ మైదానంలో అడుగుపెట్టేలా చేసింది. కొద్ది సమయంలోనే పూర్వ ఫిట్ నెస్ సాధించి జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడమే కాదు, మిడిలార్డర్ లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.

సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ నికొలాస్ పూరన్ క్రికెటింగ్ నైపుణ్యానికి, ఓడిపోకూడదన్న పట్టుదలకు నిదర్శనంలా నిలిచింది. మలింగ, ఏంజెలో మాథ్యూస్ వంటి బౌలర్లను ఎదుర్కొని 103 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్ లతో 118 పరుగులు చేశాడు. పూరన్ వన్డే కెరీర్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. బ్రియాన్ లారా, శివనారాయణ్ చందర్ పాల్ తరం ముగిశాక, క్రిస్ గేల్ కూడా అస్త్రసన్యాసానికి సిద్ధమైన తరుణంలో విండీస్ కు పూరన్ ఓ ఆశాకిరణం అనడంలో సందేహంలేదు.

More Telugu News