azam khan: నస్రత్ జహాన్ తప్పు చేయలేదు.. ముస్లిం మతాన్ని వదిలేసినా నాకు అభ్యంతరం లేదు: ఆజంఖాన్

  • మహిళలు తమ శరీరాలను ప్రదర్శించడం తప్పు
  • పురుషులను ఆకర్షించేలా మహిళలు ప్రవర్తించరాదు
  • టీమిండియా ఆటగాళ్ల దుస్తుల్లో కాషాయం రంగును చొప్పించడం తప్పు

సినీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ ఇటీవలే తన ప్రియుడు నిఖిల్ జైన్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె నుదుటన సింధూరాన్ని కూడా ధరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై ముస్లిం మత సంస్థలు ఫత్వాను జారీ చేశాయి. దీనిపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ స్పందిస్తూ... హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకుని, హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తుండటంలో తనకు తప్పు కనిపించడం లేదని అన్నారు. నస్రత్ జహాన్ ముస్లిం మతాన్ని వీడినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పెళ్లి ఎలా చేసుకోవాలనే నిర్ణయించుకునే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని అన్నారు.

బాలీవుడ్ నటి జైరా వాసిం సినీ పరిశ్రమను వదిలేస్తున్నానంటూ చేసిన ప్రకటనపై ఆజంఖాన్ స్పందిస్తూ, తాను ముస్లింనని... శరీరాలను ప్రదర్శించే హక్కు మహిళలకు లేదనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తానని చెప్పారు. పురుషులను ఆకర్షించేలా మహిళలు ప్రవర్తించడం పూర్తిగా నిషేధమని... అది పాపమని చెప్పారు. హిందూ మతం కూడా ఇదే చెబుతోందని తాను భావిస్తున్నానని తెలిపారు. మన సొంత సంప్రదాయాలను గాలికొదిలేసి... పాశ్చాత్య నాగరికత వైపు మనం అడుగులు వేస్తున్నామని విమర్శించారు. ఒకవేళ పాశ్చాత్యుల మాదిరే ఉండాలని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టమని... తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు.

టీమిండియా ఆటగాళ్ల జెర్సీల్లో కాషాయం రంగును చొప్పించడాన్ని ఆజంఖాన్ తప్పుబట్టారు. ఆటగాళ్లపై ఇది ప్రభావం చూపుతుందని చెప్పారు. క్రీడల్లో ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలని అన్నారు. రంగుల వల్ల క్రీడా ప్రపంచంలో సమస్యలు తలెత్తరాదని చెప్పారు.

More Telugu News