Vajpayee: పాక్‌పై దాడికి వాజ్‌పేయి కూడా ప్లాన్ చేశారట!.. సంచలన విషయం వెల్లడి

  • పార్లమెంటుపై దాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై దాడికి ప్రణాళిక
  • విషయం గ్రహించి స్కూలు, ఆసుపత్రి మధ్యకు స్థావరాలను మార్చిన పాక్ ఆర్మీ
  • ‘ఎ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్’ పుస్తకంలో నేవీ మాజీ చీఫ్

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సంబంధించి ఓ సంచలన విషయం ఒకటి వెలుగుచూసింది. 13 డిసెంబరు 2001లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత పార్లమెంటుపై దాడికి పాల్పడింది. దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిన ఈ దాడి తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయి.. పాకిస్థాన్ ఆర్మీ ఆధ్వరంలో నడుస్తున్న ఉగ్ర స్థావరాలపై బాలాకోట్ తరహా వాయు దాడులు చేయాలని భావించారట.

‘ఎ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్’ పేరుతో నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో ఆవిష్కరించిన ఈ పుస్తకంలో పార్లమెంటు దాడికి సంబంధించిన విషయాలను పూసగుచ్చినట్టు వివరించారు. జైషేకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి దిగిన తర్వాత త్రివిధ దళాధిపతులు అప్పటి రక్షణ శాఖా మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాను కలిసి చర్చించారు.

 ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, ఈ దాడులను ఎలా చేయాలన్న విషయాన్ని పుస్తక రచయిత వివరించలేదు. మిరేజ్-2000 ఫైటర్ జెట్స్‌ను మాత్రం ఇందుకోసం ఎంచుకునట్టు రాసుకొచ్చారు.

అయితే, భారత్ దాడులకు సిద్ధమయ్యే అవకాశం ఉందని గ్రహించిన పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రస్థావరాలను ఓ స్కూలు, పెద్ద ఆసుపత్రి మధ్యకు తరలించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అడ్మిరల్ కుమార్ తెలిపారు. దాడి కారణంగా ఊహకు అందని నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందని వివరించారు.

More Telugu News