Stephanie Grisham: ట్రంప్ కార్యదర్శిపై ప్రతాపం చూపించిన కిమ్ బాడీగార్డులు

  • ట్రంప్ మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషామ్ కు చేదు అనుభవం
  • ట్రంప్ వద్దకు రాబోతుండడంతో అడ్డుకున్న కిమ్ సిబ్బంది
  • ఇరువర్గాల మధ్య తోపులాట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా గడ్డపై కాలుమోపిన చారిత్రక క్షణాల్లోనే ఓ అమర్యాదకర సంఘటన చోటుచేసుకుంది. ట్రంప్ మీడియా కార్యదర్శి స్టెఫానీ గ్రిషామ్ పై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బాడీగార్డులు తమ ప్రతాపం చూపించారు. కిమ్ తో ట్రంప్ కరచాలనం చేసిన సమయంలో ఉభయ కొరియాల మధ్య ఉన్న నిస్సైనిక మండలంలో అడుగుపెట్టేందుకు కొందరు అమెరికా పాత్రికేయులతో పాటు గ్రిషామ్ ప్రయత్నించారు. దాంతో, కిమ్ బాడీగార్డులు ఆమెను పక్కకి లాగేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ క్రమంలో అమెరికా, ఉత్తర కొరియా వర్గాల మధ్య తోపులాట జరగడంతో గ్రిషామ్ స్వల్పంగా గాయపడినట్టు అమెరికా మీడియా చెబుతోంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హాల్లోనూ ఆమెకు అదే తరహా అనుభవం ఎదురైంది. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చునేందుకు ఇరుదేశాల ప్రతినిధులు పోటీపడడంతో గ్రిషామ్ కుర్చీ దొరక్క అవస్థలు పడ్డారు. కుర్చీ కోసం ఉత్తర కొరియా అధికారులతో ఆమె దాదాపు కుస్తీ పట్టినంత పనైంది. అయితే, ట్రంప్, కిమ్ తమ సమావేశ స్థానాన్ని అక్కడి నుంచి మార్చుకుని భవనం వెలుపల ఏర్పాటు చేసుకోవడంతో గ్రిషామ్ అంతటి శ్రమ వృథా అయింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం మీడియా సెక్రటరీగా ఆమె ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.

More Telugu News