Anasuya Bharadwaj: కళ్ల ఎదుట జరిగే తప్పుల్ని అడ్డుకోవాల్సింది పోయి.. ఎవరినో నిందించడం దేనికి?: అనసూయ

  • అమ్మాయిలకు రక్షణ లేదంటే పోలీసులను నిందించటం
  • నీటిని సంరక్షించుకోవాలంటే ప్రభుత్వాన్ని నిందిచటం
  • కుటుంబాలను కాపాడుకోవడం మన కర్తవ్యం కాదా?
  • మనల్ని మనమే ఎడ్యుకేట్ చేసుకోవాలి

మన కళ్ల ఎదుట తప్పు జరుగుతుంటే అడ్డుకోవాల్సింది పోయి, దానికి ఎవరినో బాధ్యుల్ని చేస్తూ నిందించటం సరికాదని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నేడు ఆమె ట్విట్టర్ వేదికగా మన వనరులను, కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని వెల్లడించారు.

‘‘ప్రతి విషయానికి మనం వేరొకరిని ఎందుకు నిందించాలి? నీటిని సంరక్షించుకోవాలంటే ప్రభుత్వాన్ని, అమ్మాయిలకు రక్షణ లేదంటే పోలీస్‌నో లేదంటే ప్రభుత్వాన్ని నిందించటం, అన్నిటికీ వాళ్లనీ, వీళ్లని. మన వనరులను, కుటుంబాలను మనమే కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం కాదా? మన ముందు, మన చుట్టుపక్కల ఏదన్నా చెడు లేదా తప్పు జరుగుతుంటే ఆపకుండా.. ఎక్కడో స్టేషన్‌లో కూర్చొన్న పోలీస్‌ని, ఆఫీస్‌లో ఉన్న అధికారిని, ప్రభుత్వాన్ని అనడం ఎంత వరకూ కరెక్ట్ చెప్పండి.

వాళ్లు చెయ్యగలిగింది చెయ్యగలిగినంత చేస్తారు అనే నమ్మకంతో ఉంటూ మన కళ్ల ఎదుట జరిగే తప్పును అక్కడే అడ్డుకోవాలి. ‘నేను చేసే, చేయబోయే, చేయాలనుకునే, చేయకుండా ఉండాలనుకునే పని ఒక మనిషిగా ఎంత వరకూ కరెక్ట్’ అని తమని తామే ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇది కాదా మన ప్రథమ కర్తవ్యం?’’ అని అనసూయ ట్వీట్ చేశారు.

More Telugu News