India: నీలి రంగు బదులు కాషాయం... నేడుమారిన భారత క్రికెట్ జెర్సీ... బీజేపీపై విమర్శల వర్షం!

  • నేడు ఇంగ్లండ్ తో కీలక మ్యాచ్
  • మారిన భారత జెర్సీ కలర్
  • కాషాయపు రంగులో దుస్తులు

ఇంగ్లండ్ లో జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ లో భాగంగా, అతిథ్య జట్టుతో నేడు జరగనున్న కీలక పోరులో భారత క్రికెట్ ఆటగాళ్లు ధరించే జెర్సీ రంగు మారింది. నేటి పోరులో జట్టు ఆరెంజ్‌ (కాషాయ) రంగు జెర్సీలను ధరించనుంది. దీంతో ఇప్పటివరకూ 'మెన్ ఇన్ బ్లూ'గా గుర్తింపు తెచ్చుకున్న జట్టు, 'మెన్ ఇన్ శాఫ్రాన్'గా మారనుంది. జర్సీ రంగులో కాషాయాన్ని చొప్పించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, వెస్టిండీస్ జట్టు కూడా బ్లూ కలర్ జర్సీలను ధరిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలా రెండు జట్లూ ఒకే రంగు దుస్తులతో ఆడితే అయోమయం ఉంటుందన్న ఉద్దేశంతో, టోర్నీ ప్రారంభానికి ముందే ప్రతి జట్టూ రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే భారత జట్టు రెండు జెర్సీలను ఇంగ్లండ్‌ తీసుకెళ్లింది.

కాగా, దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని, సమాజ్‌ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. జెర్సీలకు మరో రంగు ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే, మూడు రంగులను ఎంచుకుని ఉండాల్సిందని, అప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదని సూచించారు. ఈ వాదనను వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌, జెర్సీ రంగుపై రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. ఆరెంజ్‌ జెర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News