Australia: వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్... ఆసీస్ పై చివరి ఓవర్లో మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసిన బౌల్ట్

  • ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు
  • రాణించిన ఖవాజా, కేరీ
  • నిప్పులు చెరిగిన ఫెర్గుసన్, బౌల్ట్, నీషామ్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో బ్యాట్స్ మన్లకే కాకుండా బౌలర్లకు కూడా పిచ్ లు సహకరిస్తుండడంతో బంతికి, బ్యాట్ కు మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియాతో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న లీగ్ పోరులో కివీస్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ సాధించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో 50వ ఓవర్ బౌలింగ్ చేసిన బౌల్ట్ వరుసగా ఖవాజా, స్టార్క్, బెహ్రెన్ డార్ఫ్ లను అవుట్ చేశాడు. నాలుగో బంతికి కూడా వికెట్ దక్కేదే కానీ కొద్దిలో మిస్సయింది. ఈ మ్యాచ్ లో బౌల్ట్ మొత్తమ్మీద నాలుగు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

కాగా, ఆసీస్ ఇన్నింగ్స్ లో ఖవాజా 88 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ 71 పరుగులతో రాణించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు ఖవాజా, కేరీల చలవతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు చేశారు. కివీస్ స్పీడ్ స్టర్ లాకీ ఫెర్గుసన్, ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ కు చెరో 2 వికెట్లు దక్కాయి.

More Telugu News