pragathi bhavan: ఆంధ్రావాళ్లు వెళితే మళ్లీ దొరకరన్న సీఎస్ ...'అలాగని అరెస్టు చేస్తారా ఏంది!' అన్న కేసీఆర్.. సీఎంల సమావేశంలో సరదా ముచ్చట్లు!

  • గోదావరి జలాల వినియోగంపై సమావేశమైన కేసీఆర్‌, జగన్‌
  • తదుపరి భేటీ ఎప్పుడని తమ సీఎస్‌ను అడిగిన కేసీఆర్‌
  • ఈ సందర్భంగా పరస్పరం చలోక్తులతో నవ్వుల హరివిల్లు

కృష్ణా నదిలోకి గోదావరి వరద జలాల తరలింపు, ఇరు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించేందుకు జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ‘కాసేపు సరదాగా...’ అన్నట్లు అధికారులు, ముఖ్యమంత్రుల వ్యాఖ్యలతో నవ్వులు విరిశాయి. నిన్న ప్రగతి భవనంలో సహచర మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

ఆద్యంతం సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరగడంతో రెండు రాష్ట్రాల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దాదాపు సమావేశం ముగింపు దశకు వచ్చేసరికి ‘అధికారుల తదుపరి భేటీ ఎప్పుడు?’ అంటూ తమ సీఎస్‌ జోషీని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. దీనిపై జోషి స్పందిస్తూ ‘వెంటనే భేటీ అవుతాం సార్‌...ఎందుకంటే ఈ ఆంధ్రావాళ్లు (అధికారులు) వెళితే మళ్లీ దొరకరు’ అంటూ సరదాగా అన్నారు.

దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ 'ఓర్నీ...ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా? ఏంది?’ అంటూ నవ్వుతూ అనడంతో, 'అవసరం అయితే అరెస్టు చేయడమే’ అంటూ జోషి చమర్కరించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. ఈ సందర్భంలో ఏపీ సీఎం జగన్‌ జోక్యం చేసుకుని ‘మంచి కోసం అరెస్టు చేసినా పర్వాలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

More Telugu News