rajasekhar: నేటి సినిమా రివ్యూ: కల్కి

  • మరోసారి పోలీస్ పాత్రలో రాజశేఖర్
  •  పాటలు తక్కువ .. పాత్రలు ఎక్కువ
  • ఎక్కువైనట్టుగా అనిపించే ట్విస్టులు      

చురుకైన చూపులు .. మెరుపుల్లాంటి కదలికలు .. ముక్కుసూటిగా వెళ్లే తీరు .. మృత్యువును సైతం లెక్కచేయని పోరు .. పోలీస్ పాత్రలకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు తెరపై అలాంటి పోలీస్ పాత్రలకి రాజశేఖర్ పెట్టింది పేరుగా కనిపిస్తారు. కెరియర్ ఆరంభం నుంచి కూడా పోలీస్ పాత్రల ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేస్తూ వచ్చిన రాజశేఖర్, మరోసారి అదే తరహా పాత్రలో ఆకట్టుకోవడానికి చేసిన సినిమానే 'కల్కి'.

కథలోకి అడుగుపెడితే .. 'కొల్లాపూర్' అనే ఒక గ్రామంలో 'దొర'గా .. ఎమ్మెల్యేగా నర్సప్ప (అషుతోష్ రానా) తనకి ఎదురులేదనే ధైర్యంతో ఎన్నో అరాచకాలు సృష్టిస్తుంటాడు. తనని నమ్మించి మోసం చేశాడనే పగతో ఆయనకి ప్రత్యర్థి వర్గంగా పెరుమాండ్లు (శత్రు) తయారవుతాడు. ఈ ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలో నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధు జొన్నలగడ్డ) హత్య చేయబడతాడు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఆ గ్రామానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా 'కల్కి' (రాజశేఖర్) వస్తాడు. ఇదే కేసును గురించి తనదైన శైలిలో ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తోన్న క్రైమ్ రిపోర్టర్ దేవదత్త (రాహుల్ రామకృష్ణ) సహకారంతో 'కల్కి' తన ఆపరేషన్ మొదలుపెడతాడు. ఆయనని ఆ ఊరు నుంచి పంపించేయడానికి నర్సప్ప చేసే ప్రయత్నాలు .. ఆ అవరోధాలను ఎదుర్కుంటూ 'కల్కి' ఆ కేసు చిక్కుముళ్లు విప్పుతూ వెళ్లే ఆసక్తికరమైన సంఘటనలతో కథ ముందుకు వెళుతుంది.

రాజశేఖర్ కి పోలీస్ పాత్రలు కొట్టిన పిండి. ఈ తరహా పాత్రలను ఎంతో కాలం నుంచి చేస్తూ వస్తోన్న ఆయనను, అంతకి మించి చూపించడం అంత తేలికైన విషయం కాదు. కానీ రెండు .. మూడు సినిమాలకి మించి పెద్దగా అనుభవం లేని ప్రశాంత్ వర్మ, ఈ విషయంలో చాలావరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అక్రమార్కులను అణచివేసే 'కల్కి' పాత్రను చాలా బాగా డిజైన్ చేశాడు. దశావతారాలకి రాజశేఖర్ పాత్రకి ముడిపెడుతూ ఆయన ఆవిష్కరించిన సన్నివేశాలు .. ఆయా అవతారాలు ఉపయోగించిన ఆయుధాలతోనే రాజశేఖర్ తో దుష్ట శిక్షణ చేయించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే రాజశేఖర్ లుక్ విషయంలోనే ఆయన మరింత శ్రద్ధ పెడితే బాగుండుననిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ లో చిక్కుముళ్లు వేస్తూ .. సెకండాఫ్ లో వాటిని విప్పుకుంటూ వెళ్లిన తీరు ఓకే. అయితే ట్విస్టులు ఎక్కువ కావడమనేది కామన్ ఆడియన్ ను కన్ఫ్యూజన్ లో పడేసేలా అనిపిస్తుంది. ఇక కథానాయికల గ్లామర్ కి పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడం .. కామెడీ కోసం పూర్తిగా రాహుల్ రామకృష్ణపైనే ఆధారపడటమే కాస్తంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ 'కొల్లాపూర్'తో రాజశేఖర్ కి గల అసలు సంబంధాన్ని చివర్లో రివీల్ చేసిన తీరుతో ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను కొంతవరకూ మెప్పించాడనే చెప్పాలి.

నటీనటుల విషయానికొస్తే .. రాజశేఖర్ అంతా తానై ఈ సినిమాను నడిపించారు. యాక్షన్ సన్నివేశాలలో తనదైన మార్కును చూపించారు. అయితే రాజశేఖర్ ఎంతగా ప్రయత్నించినా ఆయన ఫిజిక్ పరంగా బలహీనంగా మారిపోయిన విషయం బయటపడుతూనే వుంది. కొన్ని సన్నివేశాల్లో బాగా అలసిపోయినట్టుగా .. నీరసించినట్టుగా ఆయన కనిపించారు. ఆదా శర్మ విషయానికొస్తే కథానాయికగా ఒక పాటకు .. కొన్ని సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక 'కల్కి' సాయాన్ని పొందిన ముస్లిమ్ యువతి పాత్రలో నందిత శ్వేత పాత్ర పరిధిలో నటించింది. ప్రతినాయకుడిగా అషుతోష్ రానా బాగా చేశాడు. విభిన్నమైన లుక్ తో కనిపిస్తూ చాలా సహజంగా నటించాడు. ఇక నాజర్ కూడా తనదైన శైలితో మెప్పించాడు. ఐటమ్ సాంగ్ చేసిన స్కార్లెట్ విల్సన్ కి గ్లామర్ పరంగా పడే మార్కులు చాలా తక్కువనే చెప్పాలి.
 
సంగీతం పరంగా చూసుకుంటే శ్రవణ్ భరద్వాజ్ కి మంచి మార్కులే పడతాయని చెప్పాలి. వున్నది రెండే పాటలు .. ఒకటి డ్యూయెట్ అయితే, మరొకటి ఐటమ్ సాంగ్. రాజశేఖర్ .. ఆదా శర్మ పై చిత్రీకరించిన 'ఎవరో ఎవరో' పాట బాగుంది. అలాగే 'నీ లోడు బండి' ఐటమ్ కూడా మాస్ కి ఊపునిస్తూ హుషారుగా సాగింది. ప్రేక్షకులను మూడ్ లోకి తీసుకెళ్లడంలో రీ రికార్డింగ్ ప్రధాన పాత్రను పోషించింది. దాశరథి శివేంద్ర ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు .. అడవిలోని సన్నివేశాలు .. పాటలను బాగా ఆవిష్కరించాడు. ఫైట్స్ .. కొరియోగ్రఫీ సినిమాను కొంతవరకూ ఆదుకున్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా వుంటే ఇంకా బాగుండేది. పాటలు తక్కువగా ఉండటం .. పాత్రలు ఎక్కువ కావడం .. మలుపులన్నీ వెంటవెంటనే చూపించేయడం కాస్త అసంతృప్తిని కలిగించినా, రాజశేఖర్ మార్కు సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.
 -పెద్దింటి 

More Telugu News