Telangana: తెలంగాణ అప్పులతో అల్లాడుతుంటే.. కేసీఆర్ అట్టహాసాలకు పోతున్నారు!: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

  • గత ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అన్నారు
  • ఇప్పుడు అసెంబ్లీ భవనాల నిర్మాణం అంటున్నారు
  • జగన్-కేసీఆర్ భేటీని మేం స్వాగతిస్తున్నాం
  • హైదరాబాద్ లో మీడియాతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అప్పులతో అల్లాడుతుంటే, కేసీఆర్ అట్టహాసాలకు పోతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లాగా కేసీఆర్ అసెంబ్లీ కోసం భవనాలు కడుతున్నారు.

గత ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అన్నారు. ఇప్పుడు సచివాలయం నిర్మాణం అంటున్నారు. ఏకపక్షంగా ముందుకుపోతే కేసీఆర్ తను తీసుకున్న గోతిలో తానే పడతారు’ అని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమావేశం కావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. జల వివాదానికి సంబంధించి కేసీఆర్ అఖిలపక్ష భేటీ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో పోరాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.

More Telugu News