నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత అందుకే ఓడిపోయింది!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

28-06-2019 Fri 13:12
  • నిజాం షుగర్స్ తెరిపిస్తామని కేసీఆర్ చాలా హామీలిచ్చారు
  • కానీ వాటిని కేసీఆర్ అస్సలు నిలబెట్టుకోలేదు
  • ధర్మపురి అరవింద్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కవిత ఓడిపోవడానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వివాదమే కారణమని స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామనీ, కార్మికులకు ఉపాధి కల్పిస్తామని గతంలో కేసీఆర్ చాలాసార్లు హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు.

కానీ ఆ హామీలను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయిన ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు.