vellampalli: అందరికీ తాగునీరు అందించేందుకు ప్రణాళికా బద్ధంగా వెళుతున్నాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • విజయవాడలో పలు ప్రాంతాల్లో పర్యటించిన వెల్లంపల్లి
  • టీడీపీ చేసిన అభివృద్ధి ఇదేనా? అంటూ ప్రశ్న
  • వైసీపీపై విమర్శలు చేయడానికే సమయం సరిపోయిందంటూ మండిపాటు

అందరికి తాగునీరు అందించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, విజయవాడ నగరంలో మురుగు నీరు, వర్షపు నీరు పారుదలకు చర్యలు చేపట్టామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని ఉర్మిలా నగర్, బ్రహ్మంగారి కాలనీ, జోజి నగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా, ఈ ప్రాంత అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్షం పడితే బయటకు వచ్చే పరిస్థితి లేదని... డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడం లేదని ఫిర్యాదు  చేశారు.  

ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ విజయవాడకు చంద్రబాబు, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు జగన్, వైసీపీ నాయకులపై విమర్శలు చేయడానికే సమయమంతా సరిపోయిందని విమర్శించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. భవానీపురంలో ఉన్న దర్గా ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దర్గా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

More Telugu News