secretarate: తెలంగాణ నూతన సచివాలయం భవనానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్‌

  • పాత సచివాలయం స్థలంలోనే కొత్తది నిర్మాణం
  • రూ.400 కోట్లతో నిర్మించనున్న భవనం
  • ఎర్రమంజిల్‌లో రూ.100 కోట్లతో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈరోజు ఉదయం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ భవనం స్థానంలోనే రూ.400 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయం డి-బ్లాక్‌ వెనుక భాగంలోని తోటలో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీచైర్మన్లతో కలిసి కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌ తొలుత భూమిపూజ చేశారు. అనంతరం పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. హారతి అనంతరం ఆత్మ ప్రదక్షిణ చేసి శంకుస్థాపన గోతిలో పూజాద్రవ్యాలు వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రూ.100 కోట్ల వ్యయంతో ఎర్రమంజిల్ లో నిర్మించ తలపెట్టిన నూతన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు. 30 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయం, 17.9 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

More Telugu News