IB: బాలాకోట్ దాడుల వ్యూహకర్త సామంత్ కుమార్ కు పదోన్నతి.. 'రా' అధిపతిగా నియామకం!

  • పంజాబ్ తీవ్రవాదానికి అడ్డుకట్ట వేసిన సామంత్ 
  • ఐబీ చీఫ్ గా అర్వింద్ కుమార్ నియామకం 
  • కశ్మీర్ వ్యవహారాల్లో అర్వింద్ దిట్ట

భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అధిపతిగా  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సామంత్‌కుమార్‌ గోయల్‌ను నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘రా’ ప్రస్తుత చీఫ్ అనిల్ ధస్మాన పదవీ కాలం శనివారంతో ముగియనుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన చేపట్టిన బాలాకోట్ దాడులకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేయడంలో సామంత్ కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ వెనక కూడా సామంత్ పాత్ర ఉంది. 1984 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన సామంత్‌కు నిఘా వ్యవహారాలు, ఆపరేషన్ల నిర్వహణలో చాలా అనుభవం ఉంది. పంజాబ్‌ తీవ్రవాదం, పాకిస్థాన్‌ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో నిపుణుడిగా మంచి పేరుంది. 1990లలో పంజాబ్‌లో తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2001లో సామంత్ ‘రా’లో చేరారు.  

ఇక, ఇంటెలిజెన్స్  బ్యూరో(ఐబీ) చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌(59)ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఐబీ చీఫ్‌ రాజీవ్‌ జైన్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండటంతో ఆ తర్వాత అర్వింద్‌ బాధ్యతలు చేపడతారు. కశ్మీర్, నక్సల్స్ వ్యవహారాల్లో నిపుణుడిగా పేరుగాంచిన అర్వింద్ 1984 బ్యాచ్‌ అసోం-మేఘాలయ క్యాడర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఐబీలో ప్రత్యేక డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

More Telugu News