Botsa Satyanarayana: కుంభకోణం వివరాలు తేలాల్సిందే... ఆ తర్వాతే రాజధాని అభివృద్ధి: బొత్స స్పష్టీకరణ

  • రూ.100తో అయ్యే పనికి రూ.150 ఖర్చు చేశారు
  • రాజధానిలో ఏ అంశం చూసినా పెద్ద కుంభకోణం కనిపిస్తోంది
  • కూల్చివేతల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని వ్యవహారంలో అన్ని అంశాలపైనా సీఎం సమీక్షించారని బొత్స తెలిపారు. రాజధాని అంశాన్ని లోతుగా పరిశీలించాలని ఆదేశించారని వెల్లడించారు. రాజధానికి సంబంధించి ఏ అంశం చూసినా పెద్ద కుంభకోణం కనిపిస్తోందని అన్నారు. ల్యాండ్ పూలింగ్, నిర్మాణాలు, భూ కేటాయింపుల్లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాజధాని నిర్మాణం ఓ అవినీతి కూపంలా మారిందని వ్యాఖ్యానించారు.

బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమని, ఇష్టారాజ్యంగా ప్లాట్లు కేటాయించారని బొత్స పేర్కొన్నారు. అయితే, కుంభకోణం వివరాలు పూర్తిగా తేలాకే రాజధాని అభివృద్ధి సంగతి చూస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో రూ.100తో అయ్యే పనికి రూ.150 ఖర్చుచేశారని విమర్శించారు. మొత్తమ్మీద రాజధాని నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయని అన్నారు. ప్రజావేదిక నుంచే ప్రక్షాళన ప్రారంభమైందని, అక్రమ నిర్మాణాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు.

More Telugu News