Chandrababu: ప్రజావేదిక వివాదంలో విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న

  • అక్రమాస్తులతో కట్టిన లోటస్ పాండ్ నే ముందు కూల్చేయాలి
  • ప్రజావేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టలేకపోతే కూల్చివేస్తారా?
  • విధ్వంసకారులకు కూల్చడం మాత్రమే తెలుసు

ఏపీలో ఇప్పుడు ప్రజావేదిక వివాదం తీవ్రస్థాయిలో రగులుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య ప్రజావేదిక వ్యవహారం ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. కరకట్టపై ఉన్న అక్రమకట్టడాలను కూల్చివేస్తుంటే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీటుగా బదులిచ్చారు. ఏపీలో ప్రజావేదిక అక్రమ నిర్మాణం అయితే, తెలంగాణలో ఓ చెరువును పూడ్చి, దానిపై కట్టిన లోటస్ పాండ్ సక్రమ నిర్మాణం అవుతుందా? అంటూ నిలదీశారు.

అక్రమ ఆస్తులతో కట్టిన లోటస్ పాండ్ నే ముందు కూల్చేయాలని, అప్పుడే మీరు చెబుతున్న నిబద్ధత, నిజాయతీ నిలబడతాయని వ్యాఖ్యానించారు. ప్రజావేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టంలేనంత మాత్రాన దాన్ని కూల్చివేయడం సరికాదని బుద్ధా వెంకన్న అన్నారు. కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదికను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చని హితవు పలికారు. నిర్మాణం విలువ కట్టేవారికే తెలుస్తుందని, విధ్వంసకారులకు తెలిసింది కూల్చడం మాత్రమేనని విమర్శించారు. అయినా, చీనీ తోటలకు నిప్పుపెట్టే ఫ్యాక్షన్ నైజం ఎక్కడికి పోతుందంటూ బుద్ధా ఎద్దేవా చేశారు.

More Telugu News