Pakistan: పాకిస్థాన్ టెలివిజన్ లైవ్ డిబేట్ లో పిడిగుద్దుల బాగోతం... వీడియో ఇదిగో!

  • పాకిస్థాన్ లో ఘటన
  • కొట్టుకున్న ప్రభుత్వ నేత, జర్నలిస్ట్
  • వైరల్ అవుతున్న వీడియో

వేలాది మంది చూస్తున్నారని, అది ప్రత్యక్ష ప్రసారమని కూడా చూడకుండా, ఓ న్యూస్‌ చానెల్‌ చర్చాకార్యక్రమంలో ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగి, పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్‌ లో జరిగింది. అధికార పార్టీ  పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌ ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.

 ఈ చర్చా కార్యక్రమంలో ప్రభుత్వంపై ఇంతియాజ్ విమర్శలు గుప్పిస్తుండగా, ఇద్దరు నేతల మధ్యా మాటమాట పెరిగింది. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతన్ని కొట్టారు. దీంతో ఇంతియాజ్ సైతం ప్రతిదాడికి దిగారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభాసగా మారగా, ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరిని విడదీసేందుకు యాంకర్‌ తో పాటు కార్యక్రమ నిర్వాహకులు కలుగజేసుకోవాల్సి వచ్చింది.

ఫైటింగ్ తరువాత మసూర్‌ లైవ్ ను కొనసాగించగా, ఇంతియాజ్ మాత్రం వెళ్లిపోయారు. ఆ తరువాత చానెల్‌ తన లైవ్ షోను కొనసాగించింది. ఈ వీడియోను పాక్‌ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసుకున్నారు. "దాడిచేయడమేనా నయా పాకిస్తాన్‌?" అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News