Telangana: టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్!

  • నాపై తప్పుడు కథనాలు రాస్తున్నారు
  • బోధన్ ఫ్యాక్టరీని పట్టించుకోవడం లేదంటున్నారు
  • నేనేమీ కండకావరం ఎక్కిన దొరను కాదు

నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు. బోధన్ ఫ్యాక్టరీ చెరుకు రైతులను తాను పట్టించుకోవడం లేదని గులాబీదళం(టీఆర్ఎస్ నేతలు), ఓ ప్యాకేజీ పత్రిక ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న నిజామాబాద్ లోని తన ఇంట్లో మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ రవి శంకర్ గౌడ్ ఉద్యోగులు విజయశాస్త్రి, ముహమ్మద్ సలీం,స్వామితో తాను సమావేశం అయ్యానని తెలిపారు.

అనంతరం మరుసటి రోజున ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో వీరంతా మరోసారి తనను కలిశారనీ, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా కోరారని చెప్పారు. రైతులను, కార్మికులను పట్టించుకోకుండా ఉండటానికి తాను కండకావరం ఎక్కిన దొరను కాదని స్పష్టం చేశారు.

తాను ప్రజా సేవకుడి సైన్యంలో ఓ సేవకుడిని అని చెప్పారు. ప్రజల రక్తం తాగి, పాపపు సొమ్ముతో నడిచే ఓ దినపత్రికను, దాంట్లో వచ్చే పిచ్చి రాతలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిల్లర కథనాలు రాసేముందు తనను ఫేస్ బుక్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలని అరవింద్ సూచించారు.

More Telugu News