Andhra Pradesh: పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా ‘అమ్మఒడి’ వర్తిస్తుంది: సీఎంఓ

  • ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదు
  • ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలైనా ఈ పథకం వర్తిస్తుంది
  • విద్యార్థి పేదరికాన్ని కొలమానంగా తీసుకుంటాం

ఏపీలో ‘అమ్మఒడి’ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్న వదంతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది. పేద పిల్లలు చదివేది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలైనా, ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. విద్యార్థి పేదరికాన్ని కొలమానంగా తీసుకుంటామని తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మెరుగుపర్చడం, అక్షరాస్యతా శాతం పెంచడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొంది. సీఎం ఇప్పటికే ప్రకటించారు. దేశంలో నిరక్షరాస్యత సగటు 26 ఉంటే, ఏపీలో మాత్రం 33 శాతం ఉందని, ప్రతిఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ‘అమ్మఒడి’ తీసుకొస్తున్నట్టు తెలిపింది.

కాగా, ‘అమ్మఒడి’ పథకం కింద  పేద విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ‘నవరత్నాలు’ లో జగన్ హామీ ఇచ్చారు.

More Telugu News