Telangana: హరీశ్.. నీలా నేను వెనుక గోతులు తీయను.. దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు రా!: జగ్గారెడ్డి సవాల్

  • సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చింది
  • లేదంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?
  • హరీశ్ రావుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని వ్యాఖ్యానించారు. అలాంటిది కాంగ్రెస్ తెలంగాణకు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ నేతలు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ కు తాగునీరు తెచ్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి హాజరైన జగ్గారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి ఆరోపించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మానుకోవాలని టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. ఏ ప్రాజెక్టును ఎవరు కట్టారో జనం దగ్గరకు వెళదామనీ,  తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని టీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు సవాల్ విసిరారు. హరీశ్ రావులా తాను వెనుక గోతులు తీయనని విమర్శించారు. ఇంట్లో పంచాయతీ ఉంటే మీరు-మీరు చూసుకోవాలని చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిన తరహాలో రాష్ట్రంలోని  ప్రతిపక్షాలను కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానించి ఉంటే బాగుండేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

More Telugu News