Tamilnadu: 55 ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన వంతెన...ఇన్నేళ్ల తర్వాత మళ్లీ?

  • బయటపడి ధనుష్కోడి వంతెన
  • ఆసక్తిగా తిలకిస్తున్న పర్యాటకులు
  • ఇసుక కోతకు గురికావడంతో వెలుగులోకి

ఎప్పుడో ఐదున్నర దశాబ్దాల క్రితం అప్పటి తుపాన్‌ ధాటికి సముద్ర గర్భంలో కలిసిపోయిన వంతెన ఒకటి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బయటపడడం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ వంతెనను తికించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తమిళనాడు తూర్పుతీరాన రామేశ్వరం దీవి దక్షిణ అంచున ఉన్న చిన్న గ్రామం ధనుష్కోడి.

1914 నుంచీ రామేశ్వరం-ధనుష్కోడి మధ్య రహదారి ఉండేది. ఈ రహదారిని హైవేగా మార్చి ధనుష్కోడి వద్ద తీరాన్ని ఆనుకుని  20 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవైన వంతెనను ఆ తర్వాత కాలంలో నిర్మించారు. సిమెంటు పిల్లర్లు వేసి రక్షణ గోడతో వంతెన నిర్మాణం చేపట్టారు. చాలా ఏళ్లపాటు ఈ వంతెన సేవలందించింది.

కాగా, 1964లో భారీ తుపాన్‌కు తీరం అల్లకల్లోలమయింది. సముద్రం ఉప్పొంగి ముంచేయడంతో ధనుష్కోడి వద్ద తీరంలో ఉన్న వినాయక ఆలయం, రైల్వేస్టేషన్‌, పలు భవనాలు, నిర్మాణాలతోపాటు ఈ వంతెన కూడా సముద్రగర్భంలో కలిసిపోయింది. పెద్దఎత్తున ఇసుక మేటలు పేరుకుపోవడంతో వంతెనతోపాటు రహదారి కూడా కనుమరుగయ్యింది.

దీంతో ఈ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం 60 కోట్ల వ్యయంతో ధనుష్కోడికి ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించింది. కాగా, అప్పట్లో సముద్ర గర్భంలో కలిసిపోయిన వంతెన ఇన్నేళ్ల తర్వాత జరిగిన ఇసుక కోతతో మళ్లీ బయటపడింది. వంతెన సిమెంటు పైపులు, రక్షణ గోడ చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం.

More Telugu News