Telugudesam: వేరే రాజ్యాంగం ఏమైనా టీడీపీ రాసుకుందేమో!: జీవీఎల్ సెటైర్లు

  • విలీనం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగింది
  • మాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం లేదు
  • టీడీపీ వితండ వాదన చేస్తోంది

రాజ్యసభ టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే హక్కు రాజ్యసభ చైర్మన్ కు లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ హక్కు ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సెటైర్లు విసిరారు. వేరే రాజ్యాంగం ఏదైనా తెలుగుదేశం పార్టీ రాసుకుందేమో తెలియదు గానీ, భారత రాజ్యాంగం ప్రకారం అయితే సభ్యులు ఎవరైతే ఉన్నారో వారే నిర్ణయం తీసుకోవాలి తప్పా వేరే వారు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న టీడీపీలో మూడింట రెండు వంతులు అంటే ఆరుగురిలో నలుగురు కలిసి వస్తే విలీనం కింద ట్రీట్ చేయబడుతుందని, ఈ విషయాన్ని షెడ్యూల్ 10 లో పార్ట్ 4 లో స్పష్టంగా చెప్పారని అన్నారు. టీడీపీ వితండ వాదన చేస్తోందని, టీడీపీ చేసే ప్రయత్నాలు కేవలం కంటితుడుపు చర్యలేనని అన్నారు. ఈ విషయమై టీడీపీ న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భావించడం వారి హక్కు అని, దానికి తామెందుకు అడ్డు చెబుతామని అన్నారు. విలీనం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిన చర్య కనుక తమకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

More Telugu News