Devineni Avinash: నాడు టీడీపీని వీడిన కేసీఆర్ నేడు సీఎం, తమ్మినేని స్పీకర్... దేవినేని అవినాశ్ కీలక వ్యాఖ్యలు

  • ఎంతో మంది పార్టీని వీడారు
  • ఇంకెంతో మందిని నాయకులుగా తయారు చేస్తాం
  • బహిరంగ లేఖలో అవినాశ్

గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, పేరు తెచ్చుకుని, ఆపై పార్టీని వీడిన ఎంతో మంది నేతలు ఇప్పుడు కీలక పదవుల్లో కొనసాగుతున్నారని తెలుగు యువత ఏపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. టీడీపీని వీడిన కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా ఉంటే, తమ్మినేని ఏపీకి స్పీకర్ గా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీ పెట్టిన భిక్షతోనే ప్రభుత్వాలు నడిచిన చరిత్ర కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.

టీడీపీ కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాసిన ఆయన, 2014 నుంచి 2018 మధ్య టీఆర్‌ఎస్‌ మనుగడకు, టీడీపీ నుంచి వెళ్లిన నేతల పాత్రే కీలకమని అన్నారు. ఎందరు నాయకులు పార్టీని వీడినా, కుంగిపోకుండా కొత్త నేతలను తయారు చేసుకున్న ఏకైక పార్టీ టీడీపీయేనని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా పార్టీ నడుస్తోందని, అధికారం కోల్పోయినా, రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తామని అవినాశ్ స్పష్టం చేశారు. ఇంతవరకూ 300 మంది పార్టీని వీడారని, నాయకత్వ లక్షణాలున్న వారిని ఎంపిక చేసి, వారినే నేతలుగా తయారు చేస్తామని అన్నారు.

టీడీపీలో నేతగా ఎదిగిన నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ లో చేరి, ప్రస్తుతం లోక్‌ సభ పక్షనేతగా ఉన్నారని గుర్తు చేసిన అవినాశ్, ఎందరు వెళ్లిపోయినా నష్టం లేదని చెప్పారు. కార్యకర్తలు అభిమానులు తమకు అండగా వుంటారని ఆశిస్తున్నానన్నారు.

More Telugu News