India: ఏపీలో నేటి నుంచి, టీఎస్ లో రేపటి నుంచి వానలు!

  • రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త
  • రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి
  • ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనానికి అవకాశం

తొలకరి వానల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు ఆంధ్రప్రదేశ్ ను, రేపు తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని, వీటి ప్రభావంతో నేటి నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాకు ఆవల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టానికి 3.6 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నిలిచిందని, దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చని హెచ్చరించారు. కాగా, నిన్న ఏపీలో పలు ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే, నాలుగు నుంచి ఏడు డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News