chennai: నిన్న స్నానం చేద్దామంటే నీళ్లు లేవు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

  • చెన్నైలో తీవ్రమైన నీటి ఎద్దడి
  • బంగారం కన్నా నీరు ఎంతో ముఖ్యం
  • భావి తరాలకు అందించే బాధ్యత మనదే
  • ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో ఎస్పీబీ

తమిళనాడులో, ముఖ్యంగా చెన్నై నగరంలో ఎంత నీటి ఎద్దడి ఉందో, తాను ప్రత్యక్షంగా అనుభవించానని సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తాను స్నానం చేద్దామంటే నీళ్లు లేవని, అర బకెట్ నీళ్ల కోసం అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. 'గూర్ఖా' అనే తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న ఎస్పీబీ, సభికులు అంతా నీటి పొదుపును పాటించాలని హితవు పలికారు. భావి తరాలకు పుష్కలమైన ఆస్తిపాస్తులు ఇవ్వడం కన్నా, నీటిని పొదుపు చేసి అందించడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

"ఈ రోజు మా ఇంట్లో నేను స్నానానికి అర బకెట్ నీళ్లకు అరగంట వేచి చూశాను. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు. ఓ ముఖ్యమైన విషయం చెబుతున్నాను. బంగారం, ప్లాటినం కన్నా నీరు విలువైనది. నగరంలో నీటి ఎద్దడి బాగా ఉంది. అందుకు మనమే కారణం. నీటిని పొదుపు చేయండి. కంచాలలో తినే బదులు విస్తరాకుల్లో తింటే నీరు ఆదా అవుతుంది. ప్రతిరోజూ బట్టలను మార్చే బదులు, వారంలో రెండు జతలు మాత్రమే ధరిస్తే, ఉతికేందుకు ఖర్చయ్యే నీరు మిగులుతుంది. నీరు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. నీటి వనరులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని, అప్పుడే మన బిడ్డలు, వారి బిడ్డలకు నీరందుతుందని ఎస్పీబీ అన్నారు.

More Telugu News