Toss: వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్

  • టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
  • మ్యాచ్ కు పొంచివున్న వానగండం
  • అభిమానుల్లో తారాస్థాయికి చేరిన ఉత్కంఠ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి. వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ సమరం మరికాసేపట్లో మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో దాయాదుల సమరానికి మాంచెస్టర్ ఆతిథ్యమిస్తోంది. ఈ చిరకాల ప్రత్యర్థుల సమరంలో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణంలో తేమ ఉండడంతో తమ పేస్ బౌలర్లు భారత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తారన్న ఉద్దేశంతో పాక్ సారథి సర్ఫరాజ్ నవాజ్ మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయారనడంలో అతిశయోక్తిలేదు.

అయితే, మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్ లో ఉదయం నుంచి వర్షం అడపాదడపా కురుస్తుండడం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు స్థానం కల్పించారు. ఇప్పటివరకు పెద్దగా అంతర్జాతీయ అనుభవంలేని విజయ్ శంకర్ ఏకంగా పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ అరంగేట్రం చేయనుండడం విశేషం అని చెప్పాలి. ఇక పాక్ టీమ్ లో షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసింలకు చోటిచ్చారు. 

More Telugu News