Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ను పొగుడుతూనే చురకలు అంటించిన సీపీఐ నేత నారాయణ!

  • హోదా తెస్తానని జగన్ అధికారంలోకి వచ్చారు
  • తక్కువ సమయంలోనే ఎక్కువ మంచి పనులు చేస్తున్నారు
  • ఢిల్లీలో మీడియాతో సీపీఐ నేత

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తానని వైసీపీ అధినేత జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారని సీపీఐ నేత నారాయణ తెలిపారు. ఎక్కువ లోక్ సభ సీట్లు గెలిపిస్తే కేంద్రంతో పోరాడి హోదా తెస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో గెలిచిన లోక్ సభ సీట్ల సంఖ్య ప్రధానం కాదని చెప్పారు. హోదా తీసుకురావాలన్న సిద్ధాంతం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడారు.

జగన్ హోదాపై కేంద్రాన్ని అడుక్కోవడం సరికాదనీ, పోరాడి సాధించాలని సూచించారు. జగన్ ప్రస్తుతం ఎక్కడా హోదా కోసం పోరాటం దిశగా సాగడం లేదని విమర్శించారు. హోదా పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొంది దాన్ని ఇప్పుడు సాధించకుండా వదిలేయడం మంచిది కాదని హితవు పలికారు. జగన్ చాలా తక్కువ సమయంలో ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఎక్కువ మంచి పనులు చేస్తున్నారనీ, ఇది సంతోషకరమైన విషయమని ప్రశంసించారు. అలాగే హోదా కోసం కూడా పోరాడితే బాగుంటుందని చెప్పారు.

రాబోయే ఐదేళ్లలో ఏపీ, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని మోదీ చెబుతున్నారనీ, కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంపై తాము యూజీసీకి ఫిర్యాదు చేశామని సీపీఐ నేత నారాయణ తెలిపారు.

అధ్యాపకుల నియామకం విషయంలో సంస్కృత విద్యాపీఠం రిజర్వేషన్లను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై యూజీసీ చైర్మన్ డీపీ సింగ్ ను ఈరోజు ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించామని చెప్పారు. యూజీసీ చైర్మన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.

More Telugu News