Odisha: ఒడిశాలో దారుణం.. పంట బాగా పండాలని నరబలి!

  • సోదరుడి కొడుకును బలిచ్చిన రైతు
  • తాంత్రికుడి మాటలపై విశ్వాసంతో ఘాతుకం
  • పోలీసుల అదుపులో నిందితుడు

నరబలి ఇస్తే సాగు బాగుంటుందన్న అంధ విశ్వాసంతో ఓ రైతు ఓ చిన్నారి ప్రాణాలను బలిగొన్నాడు. ఒడిశాలోని నువాపడా జిల్లా జడముండా గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన చింతామణి మాఝీ, రూప్ సింగ్ అన్నదమ్ములు. శనివారం మధ్యాహ్యం చింతామణి తన పొలంలో పనిచేసుకుంటున్న సమయంలో రూప్‌సింగ్ 12 ఏళ్ల కుమారుడు ధన్‌సింగ్ తండ్రికి భోజనం తీసుకొస్తూ కనిపించాడు.

అది చూసిన చింతామణి ఆ చిన్నారిని పిలిచి పొలంలోనే పీక కోసి చంపేశాడు. దూరం నుంచి గమనించిన బాలుడి తండ్రి రూప్‌సింగ్ పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన వద్ద నున్న కత్తితో తమ్ముడిని కూడా చింతామణి బెదిరించాడు. చూసిన చుట్టుపక్కల రైతులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఖరీఫ్ సాగు బాగుండాలంటే నరబలి ఇవ్వాలన్న తాంత్రికుడి మాట ప్రకారమే ఈ పని చేసినట్టు చింతామణి పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News