Revanth Reddy: 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకున్న టీడీపీకి.. అంతమందే మిగిలారు.. టీఆర్ఎస్‌కూ అదే గతి: రేవంత్ ఫైర్

  • ఎమ్మెల్యేలను విలీనం చేసేందుకు స్పీకర్‌కు సిగ్గుండాలి
  • టీడీపీ విలీనం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది
  • ఫిరాయింపులపైనే కేసీఆర్ దృష్టి
  • కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకువచ్చారు

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలను వినని స్పీకర్, 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు సిగ్గుండాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకున్న టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో అంతమందే మిగిలారని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌కు కూడా 12 మంది ఎమ్మెల్యేలే మిగులుతారని జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 21, 2016లో టీడీపీ విలీనం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. సీఎల్పీ విలీనం నిబంధనల ప్రకారమే జరిగిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్‌ని కేటీఆర్ సంప్రదించాలన్నారు.

విలీన అంశం స్పీకర్ పరిధిలోనిది కాదని, అసలు ఆ అధికారం స్పీకర్‌కు లేదని రేవంత్ పేర్కొన్నారు. పార్టీని వీడుతున్నట్టు లేఖలు విడుదల చేసిన ఎమ్మెల్యేలు, అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎలా సమావేశం నిర్వహిస్తారని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ ప్రజా సమస్యలు, అభివృద్ధి మాని, ఫిరాయింపులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశం పెట్టి ఏ రాజ్యాంగం ప్రకారం సీఎల్పీని విలీనం చేశారో కేసీఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. 45 శాతం మంది ఓటర్లు పాల్గొనని స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే అదేదో గ్రామాలు మొత్తం గులాబీ మయం అయినట్టు ప్రచారం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

More Telugu News