modi: ‘ఓం నమో వెంకటేశాయ..’ అంటూ శ్రీవారి స్తోత్రాన్ని పఠిస్తూ ప్రసంగం ప్రారంభించిన మోదీ

  • స్వామికి నా ప్రణామాలు
  • మళ్లీ మాకు అధికారమిచ్చిన ప్రజలందరికీ కృతఙ్ఞతలు
  • ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం నాకు లభించింది

రేణిగుంట విమాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం, తిరుపతిలో ఏర్పాటు చేసిన బీజేపీ నిర్వహించిన ప్రజా ధన్యవాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీని బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం, ‘భారత మాతాకీ జై అంటూ’ తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. ‘ఓం నమో వెంకటేశాయ.. సదా వెంకటేశం స్మరామి స్మరామి..’ అంటూ తెలుగు భాషలోని స్వామి వారి స్తోత్త్రంను మోదీ పఠించారు. బాలాజీ పాదాలు, పద్మావతి సాక్షిగా మళ్లీ తమకు అధికారం ఇచ్చిన ప్రజలందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని, ‘స్వామికి నా ప్రణామాలు’ అంటూ తెలుగులో కొద్దిసేపు ఆయన మాట్లాడారు.

ఆ తర్వాత హిందీ భాషలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, వేంకటేశ్వరుడి సన్నిధిలో ఇంతపెద్ద సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక నుంచి నేరుగా ఇక్కడికి రావడంలో కొంత ఆలస్యం జరిగిందని, అందుకు తనను క్షమించాలని కోరారు. తిరుపతికి అనేకసార్లు వచ్చే అదృష్టం తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరుడి సన్నిధిలో తల వంచి ఆశీస్సులు తీసుకుందామని ఇక్కడికి వచ్చానని, దేవ దేవుని దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం తనకు లభించిందని మోదీ వ్యాఖ్యానించారు.

More Telugu News