YSRCP: ఆ విషయం జగన్ నే అడగాలంటూ నవ్వులు చిందించిన తమ్మినేని సీతారాం

  • స్పీకర్ గా తన పేరు ప్రతిపాదించడంపై తమ్మినేని హ్యాపీ
  • నాయకుడు ఆదేశించిన దాన్ని తు.చ. తప్పక పాటిస్తా
  • నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పా

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం పేరు దాదాపు ఖరారైనట్టే. అధికారికంగా తమ్మినేని పేరు ప్రకటించడం ఇక లాంఛనప్రాయమే. ఈ తరుణంలో తమ్మినేనిని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడారు.

‘స్పీకర్ గా జగన్ ని మిమ్మల్నే ఎంచుకోవడానికి కారణమేంటి?’ అన్న ప్రశ్నకు తమ్మినేని స్పందిస్తూ, ఈ ప్రశ్న అడగాల్సింది తనను కాదని, ఆయన్నే (జగన్) అడగాలంటూ నవ్వులు చిందించారు. నాయకుడు ఏది ఆదేశిస్తే, దాన్ని తు.చ. తప్పకుండా పాటించడం తనకు మొదటి నుంచి ఉన్న అలవాటని చెప్పారు. వైసీఎల్పీ మీటింగ్ అనంతరం, తనను రమ్మనమని జగన్ కబురు చేస్తే వెళ్లానని, ‘అన్నా, మీకు చాలా బరువైన బాధ్యతలు అప్పచెబుతున్నా. మీ అనుభవాన్ని జోడించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిలో శాసనసభా పతిగా మీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నాను’ అని జగన్ తనతో చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

‘తప్పకుండా సార్, మీరు నాపై ఉంచిన అపారమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని కచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’ అని చెప్పానని గుర్తుచేసుకున్నారు. శాసనసభపై కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టేందుకు తనకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటానని, ఉన్నత విలువలతో కూడిన శాసనసభగా నిలబెడతానని, అందుకు సభ్యులు కూడా సహకరించాలని జగన్ ని కోరానని అన్నారు. 

More Telugu News