India: దెబ్బమీద దెబ్బతో కుదేలైన దక్షిణాఫ్రికా... ఎల్లుండి ఇండియాపై ఓడితే పరిస్థితి ఏమిటి?

  • ఇప్పటికే రెండు మ్యాచ్ లు చేజార్చుకున్న సఫారీలు
  • తదుపరి మ్యాచ్ ఇండియాపై
  • ఓడితే క్లిష్టమయ్యే సెమీస్ అవకాశాలు

దక్షిణాఫ్రికా... ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న జట్లలో బలమైనది. అయితే, వరల్డ్ కప్ లో మాత్రం ఆ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా కప్ గెలుచుకోలేదు. కీలక మ్యాచ్ లు వచ్చేసరికి ఆ జట్టును దురదృష్టం పలకరిస్తుంది. ఒకసారి వరుణుడు, మరోసారి ఆటగాళ్ల వైఫల్యం, ఇంకోసారి డక్వర్త్ లూయిస్... ఇలా సౌతాఫ్రికా పలుమార్లు వరల్డ్ కప్ లో విఫలమైంది.

ఇక తాజాగా బ్రిటన్ అండ్ వేల్స్ లో జరుగుతున్న పోటీల్లోనూ ఆ జట్టు ఇప్పటికే తానాడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. తొలి మ్యాచ్ ని ఆతిథ్య ఇంగ్లండ్ తో ఆడి, ఓటమి పాలైన సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ పైనా ఓటమిని చవిచూసింది. ఇక సౌతాఫ్రికా జట్టు ఎల్లుండి, బుధవారం ఇండియాపై ఆడాల్సివుంది.

ఇక రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో ఈ పోటీలు సాగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ప్రతి జట్టూ 9 మ్యాచ్ లు ఆడనుండగా, ఏడు గెలిస్తే గ్యారెంటీగా సెమీస్ కు చేరుకోవచ్చు. కనీసం ఆరు మ్యాచ్ లు గెలిచిన జట్టుకు సెమీస్ లో ఆడేందుకు అవకాశం రావచ్చు. ఇప్పటికే 2 మ్యాచ్ లను కోల్పోయిన దక్షిణాఫ్రికా, ఇండియాపై జరిగే హోరాహోరీ పోరులో ఓటమి పాలైతే, మూడు మ్యాచ్ లు కోల్పోయినట్లవుతుంది. ఇక ఆ జట్టు సెమీస్ చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. మూడు మ్యాచ్ లలో ఓటమి తరువాత వరుసగా ఆరు మ్యాచ్ లనూ గెలవడం ఆ జట్టుకు కష్టమే. అందునా న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ వంటి జట్లను దక్షిణాఫ్రికా ఎదుర్కోవాలి. దీంతో ఇండియాపై మ్యాచ్ లోనే విజయం సాధించి, తిరిగి గాడిలో పడాలని సఫారీలు భావిస్తున్నారు.

ఇండియా కూడా తన తొలి మ్యాచ్ లోనే విజయంతో శుభారంభం చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. భువనేశ్వర్, బుమ్రా వంటి పేసర్ల బలం సౌతాఫ్రికాను నిలువరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.

More Telugu News