తెలంగాణలోని మేడ్చల్ లో దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు దుర్మరణం!

02-06-2019 Sun 15:10
  • బట్టలు ఉతికేందుకు వెళ్లిన కుటుంబం
  • క్వారీలో లోతైన ప్రాంతానికి జారిపోయిన వైనం
  • గజఈతగాళ్ల సాయంతో మ‌ృతదేహాలు బయటకు
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు ఈరోజు క్వారీ గుంతలో దిగిన ముగ్గురు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని గాజులరామారం బాలయ్యనగర్ లో ఓ ఇంట్లో వివాహం జరిగింది. దీంతో వీరి బంధువులు ఐలమ్మ(65), అనిత(30), యశ్వంత్‌(10) కర్ణాటక లోని యాద్గిర్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో బట్టలు తీసుకుని వీరంతా ఊరిబయట ఉన్న క్వారీ గుంత దగ్గరకు చేరుకున్నారు. అక్కడ బట్టలు ఉతుకుతుండగా ఒక్కసారిగా కాలుజారి వీరంతా క్వారీలో లోతైన ప్రాంతానికి వెళ్లిపోయారు. అనంతరం నీటిలో మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.