Enforcement Directorate: విమానయానశాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు ఈడీ సమన్లు

  • విదేశీ విమానయాన సంస్థలకు లబ్ధి చేకూర్చారంటూ ప్రఫుల్‌పై ఈడీ ఆరోపణ
  • ‘డీల్’ కోసం లాబీయిస్ట్ దీపక్ తల్వార్ రూ.272 కోట్లు తీసుకున్నారన్న సీబీఐ
  • ఈడీకి పూర్తిగా సహకరిస్తానన్న మాజీ మంత్రి

ఎన్‌సీపీ సీనియర్ నేత, విమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 6న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా  ఉన్న ప్రఫుల్ పటేల్ ఎయిరిండియాకు నష్టం వాటిల్లేలా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

2008-09 మధ్య కాలంలో ఎమిరేట్ష్, ఎయిర్ అరేబియా, ఖతర్ వంటి విదేశీ విమానయాన సంస్థలకు లబ్ధి చేకూరేలా కార్పొరేట్ లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌ అప్పటి రాజకీయ నాయకులు, మంత్రులు, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు కొందరితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు సీబీఐ తేల్చింది.

ఇందుకోసం దీపక్ తల్వార్ రూ.272 కోట్లను తీసుకున్నట్టు సీబీఐ పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన ఈడీ దీపక్‌ను అరెస్ట్ చేసింది. విదేశీ విమానయాన సంస్థల తరపున ప్రఫుల్ పటేల్‌తో దీపక్ తల్వార్ సంప్రదింపులు జరిపినట్టు సీబీఐ పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన ఈడీ పటేల్‌కు సమన్లు పంపింది. ఈడీ నోటీసులపై ప్రఫుల్ స్పందించారు. ఈడీకి తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

More Telugu News