Sushma Swaraj: సుష్మ స్వరాజ్ లేకుండానే కొలువుదీరిన మోదీ క్యాబినెట్!

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మ
  • తన పేరును పరిశీలించవద్దని మోదీకి విజ్ఞప్తి
  • ఇప్పటికే జైట్లీ కూడా ఇదే తరహాలో తప్పుకున్న వైనం

పిలిస్తే పలికే నేతగా, విదేశాంగ మంత్రిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుష్మ స్వరాజ్ పేరు లేకుండానే నరేంద్ర మోదీ కొత్త క్యాబినెట్ కొలువైంది. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతిభవన్ లో మోదీ సహా 58 మంది ప్రమాణస్వీకారం చేశారు. వారిలో సుష్మ స్వరాజ్ కు స్థానం దక్కలేదు.

66 ఏళ్ల సుష్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ విదేశాంగ మంత్రిగా అద్భుతమైన రీతిలో పదవీబాధ్యతలు నిర్వర్తించారు. కానీ, ఆరోగ్యరీత్యా విశ్రాంతి అవసరమని భావించిన సుష్మ తన పేరును నూతన క్యాబినెట్ కోసం పరిగణనలోకి తీసుకోవద్దని మోదీకి సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అరుణ్ జైట్లీ కూడా ఇదే తరహాలో విశ్రాంతి కోరిన సంగతి తెలిసిందే.

కాగా, అనారోగ్యం కారణంగా సుష్మ లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీచేయలేదు. అయితే ఆమెను రాజ్యసభకు పంపి, మోదీ తన క్యాబినెట్ లోకి తప్పక తీసుకుంటారని హస్తిన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఓ సమర్థురాలైన మంత్రి అనారోగ్య కారణాలతో క్యాబినెట్ లో స్థానం కోల్పోవడం చాలామందిని బాధిస్తోంది. సుష్మ పరిస్థితి పట్ల జాలిపడుతూ చాలామంది ట్వీట్లు చేస్తున్నారు.

More Telugu News