Andhra Pradesh: వైసీపీ వెనుక ఉన్నది 50 శాతం మందే.. వాటి కారణంగానే టీడీపీ ఓడిపోయింది!: సాధినేని యామిని

  • చంద్రబాబు ఇల్లు అక్రమ నిర్మాణం కాదు
  • అక్రమమే అయితే కోర్టులు ఊరుకోవు కదా
  • యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ నేత

కృష్ణా నది తీరాన చంద్రబాబు నివాసం అక్రమంగా నిర్మించారనీ, చుట్టుపక్కల ఇసుక మేటలు తవ్వేసి వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఖండించారు. నిజంగా అలాంటి అక్రమాలు జరిగి ఉంటే కోర్టులు చర్యలు తీసుకునేవని అభిప్రాయపడ్డారు. కోర్టులకు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అన్న తేడా ఉండదని స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసం విషయంలో జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని తేల్చిచెప్పారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధినేని యామిని మాట్లాడారు. రాజధాని లేకుండా, కనీస సౌకర్యాలు లేని సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ ఐదేళ్లలో 680కి పైగా అవార్డులు సాధించిందని గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో చాలా ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకాన్ని ఎన్నికల తాయిలంగా ప్రతిపక్షాలు అభివర్ణించడాన్ని యామిని ఖండించారు.

‘ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ప్రజలకు పంచాం’ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ప్రజలు మాత్రమే ఆదరించారనీ, మిగిలిన 40 శాతం ప్రజలు టీడీపీ వైపే నిలుచున్నారని అభిప్రాయపడ్డారు. పోల్ మేనేజ్ మెంట్, ఇతర పార్టీలు ఓట్లను చీల్చడం కారణంగానే టీడీపీ ఓడిపోయిందని విశ్లేషించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను రైతు, డ్వాక్రా రుణమాఫీ చేయలేమని జగన్ ఒప్పుకున్నారనీ, కానీ టీడీపీ ప్రభుత్వం విడతలవారీగా చేసి చూపిందన్నారు. చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చు పెడితే రూ.వెయ్యి ఆదాయం తీసుకొచ్చారని తెలిపారు.

More Telugu News