Narendra Modi: ఎన్డీయే 350కి పైగా సీట్లు గెలవడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం: మోదీ

  • ఇది మోదీ విజయం కాదు, ప్రజల విజయం
  • మాది ప్రజల ప్రభుత్వమని నమ్మారు కాబట్టే ఓట్లేశారు
  • నవభారతావనికి ఇది శిలాశాసనం లాంటి విజయం

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు లభించడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం అని అభివర్ణించారు. బీజేపీకి సొంతంగా అత్యధిక స్థానాలు వచ్చినా సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

ఇది మోదీ సాధించిన విజయం కాదని, మరింత మెరుగైన జీవనం కోరుకుంటున్న ప్రజల విజయం అని పేర్కొన్నారు. మోదీ సర్కారు ఈ ఐదేళ్లలో తమ కోసమే పనిచేసిందని ప్రజలు విశ్వసించారని తెలిపారు. బీజేపీ దార్శనికతను ప్రతిబింబించేలా పనిచేశామని, ప్రజలు సైతం సాధికారత కోసం ఓట్లేశారని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన ఎన్నికలను ఎంతో పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూసిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భారీ ప్రజాసామ్య క్రతువులో పాల్గొన్న ఓటర్లకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత విధులు నిర్వహించిన బలగాలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తమను ఎన్నుకునేందుకు యావత్ భారతం ఏకమైందని కొనియాడారు. నవభారతానికి ఇది శిలాశాసనం లాంటి విజయం అని మోదీ అభివర్ణించారు.

More Telugu News