అప్పు తీర్చలేదని కేసు పెట్టిన బ్యాంకు అధికారులు.. మనస్తాపంతో కలెక్టరేట్ ముందు ఉరివేసుకున్న రైతు!
- రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ లో ఘటన
- బ్యాంకు నుంచి రూ.6.5 లక్షలు తీసుకున్న రైతన్న
- రెండేళ్లలోపు కట్టలేకపోవడంతో అరెస్ట్
హనుమాన్ గఢ్ కు చెందిన సురజరామ్(52) ఇక్కడి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి 6.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా, ఆయన్ను అరెస్ట్ చేశారు.
దీంతో సురజరామ్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన ఆయన సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.