Andhra Pradesh: ఏపీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు!

  • నెల్లూరు జిల్లాలో శ్రీలంక పడవ లభ్యం
  • ఉగ్రవాదులే వచ్చుంటారని నిఘావర్గాల హెచ్చరిక
  • కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లోకి సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు అన్ని జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. హోటళ్లు, లాడ్జీల్లో కొత్తవారు దిగితే వెంటనే సమాచారం అందించాలని యాజమాన్యాలను ఆదేశించారు. అలాగే నగరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పన్నపూడి పాతవూరు సమీపంలో మత్స్యకారులకు ఓ పడవ లభ్యమయింది.

ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీంతో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి 258 మందిని చంపేశారు. దీంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్ లోకి ప్రత్యేక బోట్ ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘావర్గాలు హెచ్చరించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కోస్ట్ గార్డ్ దళాలను అప్రమత్తం చేశారు. శ్రీహరికోటలో భద్రతను భారీగా పెంచారు.

More Telugu News