Vijayawada: లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: విజయవాడ సీపీ స్పష్టీకరణ

  • ఇప్పటికే పలువురిని బైండోవర్ చేశాం
  • లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో భద్రత
  • లెక్కింపు కేంద్రం వెలుపల పోలీసు బలగాలు

విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కౌంటింగ్ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పెనమలూరులో ఓ లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఏవైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు ద్వారకా తిరుమలరావు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

అంతకుముందు ఆయన లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఐదు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పక్కా ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని, లెక్కింపు కేంద్రం వెలుపల పోలీసుల బలగాలు ఉంటాయని సీపీ వెల్లడించారు.

More Telugu News