Karnataka: హవాలా డబ్బు తెలివిగా తరలించాలనుకున్నా దొరికిపోయాడు!

  • స్టూడెంట్‌ మాదిరిగా వేషం
  • కాలేజీ బ్యాగులో కోటి రూపాయలు పెట్టి ప్రయాణం
  • పోలీసుల తనిఖీలతో బట్టబయలైన ప్లాన్ 

హవాలా డబ్బును కళాశాల బ్యాగులో పెట్టుకుని విద్యార్థి వేషంతో తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు తెలివిగా పట్టుకున్నారు. దాదాపు కోటి రూపాయల నగదుకు నిందితుని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో హవాలా సొమ్ముగా భావించి కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... శుక్రవారం ఉదయం మంజునాథ్‌ అనే వ్యక్తి కర్ణాటక రాజధాని బెంగళూరు బస్టాండ్‌లో మంగళూరు నుంచి వచ్చిన బస్సు దిగాడు.

భుజానికి విద్యార్థులు వేసుకునే బ్యాగును తగిలించుకుని వెళ్తున్నాడు. అయితే, అతని చూపులు, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో సందేహించిన పోలీసులు అతన్ని నిలువరించి తనిఖీ చేశారు. బ్యాగులో రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు దాదాపు కోటి రూపాయలు బయటపడ్డాయి. దీంతో నగదు ఎక్కడిది? ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న వివరాలను సేకరించారు. దేనికీ సరైన సమాధానం చెప్పక పోవడం, పేరు కూడా ఒక్కోసారి ఒకటి చెప్పడంతో మంజునాథ్‌ వద్ద నుంచి ఆ డబ్బు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.

More Telugu News