sadhvi: వారానికొక రోజు తమ ముందు హాజరుకావాలంటూ సాధ్వి ప్రజ్ఞాకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం

  • మాలేగావ్ పేలుళ్ల కేసును విచారిస్తున్న ఎన్ఐఏ కోర్టు
  • నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం
  • తదుపరి విచారణ మే 20కి వాయిదా

భోపాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ వివాదాస్పద నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు ఎన్ఐఏ కోర్టు షాక్ ఇచ్చింది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సాధ్వితో పాటు కేసులో ఉన్న ఇతర నిందితులంతా వారానికి ఒక రోజు తమ ముందు హాజరు కావాలని ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చూపకుండా కోర్టు హాజరు నుంచి మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను మే 20వ తేదీకి వాయిదా వేసింది.

సాధ్వితో పాటు ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై ఉన్నారు. వీరిపై ఉగ్ర కార్యకలాపాలు, హత్య, నేరాలకు పథక రచన చేయడం వంటి అభియోగాలను ఎన్ఐఏ మోపింది.

More Telugu News