Rahul Gandhi: మోదీపై సెటైర్ వేయాలని చూసిన రాహుల్ గాంధీకి అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ

  • 'మోదీలై' పేరుతో కొత్త పదాన్ని సృష్టించిన రాహుల్
  • ఆ పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉందనేలా ట్వీట్
  • ఆ పదం తమ డిక్షనరీల్లో లేదంటూ ఆక్స్ ఫర్డ్ స్పందన

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెదుకుతుంటారని తెలిసిందే. తాజాగా ఆయన మోదీ ఓ అబద్ధాల కోరు అని చెప్పడానికి ఏకంగా 'మోదీలై' అనే కొత్త పదాన్ని సృష్టించారు. మోదీ, లై (అబద్ధం) అనే రెండు పదాలను కలిపి రాహుల్ కొత్త పదాన్ని సృష్టించారు. ఓ అబద్ధాన్ని పదే పదే చెప్పేవాడిగా ఆ పదానికి భాష్యం కూడా చెప్పారు.

అంతేకాదు, ఆ పదం ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కూడా ఉంది అని భ్రమింపజేసేలా ఓ క్లిప్ ను ఫొటోషాప్ లో రూపొందించి ట్వీట్ చేశారు. ఇంగ్లీష్ డిక్షనరీలో కొత్త పదం చేరిందని, 'మోదీలై' అనే పదాన్ని టైప్ చేస్తే మూడు రకాల అర్థాలు వస్తాయంటూ ఓ స్క్రీన్ షాట్ తరహా ఫొటోను తన ట్వీట్ లో పొందుపరిచారు.

అయితే, రాహుల్ ఏమాత్రం ఊహించని విధంగా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఈ ట్వీట్ పై స్పందించింది. 'మోదీలై' అనే పదం మా డిక్షనరీలో ఉన్నట్టుగా చూపుతున్న ఈ ఫొటో నకిలీదని మేం నిర్ధారిస్తున్నాం, మాకు సంబంధించిన డిక్షనరీల్లో దేంట్లోనూ ఈ పదం లేదు అంటూ ట్వీట్ చేసింది.

More Telugu News