Shatrughan Sinha: బీజేపీని వదిలేస్తున్నానంటే అద్వానీ కంటతడి పెట్టారే తప్ప వద్దనలేదు: శత్రుఘ్నసిన్హా

  • పార్టీని వీడే ముందు అద్వానీని కలిశా
  • ఆయన ఆశీస్సులతో సరైన దారిలో నడుస్తున్నా
  • కాంగ్రెస్ లో చేరిన శత్రుఘ్నసిన్హా

దాదాపు 20 సంవత్సరాల పాటు బీజేపీలో కొనసాగి, ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి పట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడాలని నిర్ణయించుకున్న తరువాత తాను ఎల్కే అద్వానీని కలిశానని, విషయం విన్న ఆయన కంటతడి పెట్టుకున్నారే తప్ప, తనను వెళ్లవద్దని మాత్రం చెప్పలేదని అన్నారు. తాను మరో మార్గంలో వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పి, ఆయన ఆశీస్సులు తీసుకున్నానని, తాను ఇప్పుడు సరైన దారిలోనే వెళుతున్నానని ఆయన అన్నారు.

వాజ్ పేయి కాలంలో పార్టీలో చేరిన ఆయన, పార్టీ మారే చివరి రోజుల్లో నిరసన గళం వినిపించిన విషయం తెలిసిందే. అప్పటి బీజేపీకి, ఇప్పటి బీజేపీకి  ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికి మధ్య ఉన్నంత తేడా ఉందని, సీనియర్‌ నాయకులకు తగిన గౌరవం లభించడం లేదని శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. తాను అద్వానీలా మౌనంగా ఉండలేకపోయానని, అందువల్లే బీజేపీకి రాజీనామా చేశానని అన్నారు.

బాలాకోట్‌ దాడులను పదేపదే ప్రస్తావించడం బీజేపీ చేస్తున్న తప్పని, ప్రతి భారతీయుడికీ జాతీయభావం ఉందని, బీజేపీ నాయకులు తమకు మాత్రమే ఉందన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని, మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్టు మోదీకి రాజకీయాల్లో కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.

More Telugu News