Jammu And Kashmir: కశ్మీర్ లో ఓ పిల్లాడికి స్వయంగా భోజనం తినిపించిన సీఆర్పీఎఫ్ జవాన్.. ఉన్నతాధికారుల నుంచి అనూహ్య స్పందన!

  • శ్రీనగర్ లోని డౌన్ టౌన్ లో ఘటన
  • విధులు నిర్వహిస్తున్న జవాన్ ఇక్బాల్ సింగ్
  • పిల్లాడు భోజనం కావాలని కోరడంతో సాయం
  • ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు విధులు నిర్వర్తించడం అంటే మాటలు కాదు. ఏ ఉగ్రవాది ఎటువైపు నుంచి దాడి చేస్తాడో అని ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అంతటి కష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ భారత సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు మానవత్వాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆకలితో అల్లాడిపోతున్న ఓ బాలుడికి తన భోజనాన్ని స్వయంగా తినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ ఇక్బాల్ సింగ్ తప్పించుకున్నారు. ఈ ఘటన అనంతరం 49వ బెటాలియన్ లో పనిచేస్తున్న ఇక్బాల్ సింగ్ కు కశ్మీర్ లో పోస్టింగ్ ఇచ్చారు. విధుల్లో భాగంగా శ్రీనగర్ డౌన్ టౌన్ లో ఇక్బాల్ విధులు నిర్వహిస్తున్నారు. అప్పుడే వీరికి భోజనాలు వచ్చాయి. ఇక్బాల్ భోజనం తినబోతుండగా, తనకు ఆకలి వేస్తోందని ఓ పిల్లాడు సైగలు చేశాడు. దీంతో ఇక్బాల్ తన బాక్స్ ను పిల్లాడికి ఇచ్చేశారు.

అయితే ఆ బాలుడు శారీరక వైకల్యం కారణంగా భోజనం తినలేక ఇబ్బంది పడ్డాడు. దీన్ని చూసి ఇక్బాల్ మనసు కరిగిపోయింది. వెంటనే తనే స్వయంగా పిల్లాడికి తినిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇక్బాల్ సహచరులు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇక్బాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఈ విషయం ఇంతటితో ముగిసిపోలేదు. ఈ మొత్తం వ్యవహారం సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ ఇక్బాల్ కు డీజీ డిస్క్ గౌరవంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తామని ప్రకటించారు.

More Telugu News