ED: 8 గంటల పాటు చంద కొచ్చర్ ను ప్రశ్నించిన ఈడీ!

  • వీడియోకాన్ కేసులో ఈడీ ముందు హాజరు
  • రాత్రి 8 గంటల తరువాత బయటకు
  • అధికారులు సంతృప్తి చెందేలా సమాధానాలు

వీడియోకాన్ కు రుణమిచ్చిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ లను ఈడీ అధికారులు సుమారు 8 గంటల పాటు విచారించారు. సరైన పత్రాలు లేకుండా రుణాలివ్వడం, మనీ లాండరింగ్‌ తదితర ఆరోపణలపైనే విచారణ సాగినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కొచ్చర్ దంపతులు, ముందుగానే ఈడీ ఆఫీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆపై రాత్రి 8 గంటల తరువాత వీరిద్దరూ బయటకు వచ్చారు. కొచ్చర్ దంపతులు తామెదుర్కొన్న ప్రశ్నలకు అధికారులు సంతృప్తి చెందేలా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఏ విషయాలపై వారిని ప్రశ్నించారో బహిర్గతం కానప్పటికీ,  ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద వీరి వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసినట్టు తెలుస్తోంది. నేడు కూడా కొచ్చర్‌ దంపతులను ఈడీ ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.

More Telugu News