Digvijay singh: ఓటేయని దిగ్విజయ్ సింగ్.. విరుచుకుపడిన శివరాజ్ సింగ్

  • ఆరో విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని డిగ్గీరాజా
  • ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్న చౌహాన్
  • పదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఓటేయకపోవడం దారుణమన్న మాజీ సీఎం

ఆదివారం జరిగిన ఆరో విడత ఎన్నికల్లో ఓటు వేయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. దిగ్విజయ్ వింతగా ప్రవర్తిస్తున్నారని, భయంతోనే ఆయన ఓటు వేయలేదని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓటు వేయలేదంటే ప్రజాస్వామ్యంపై ఆయనకున్న విశ్వాసం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

డిగ్గీరాజా ఓటు వేయకపోవడం వెనక మరో కారణం కూడా ఉందని, ఆయన కమల్‌నాథ్‌ను విశ్వసించడం లేదని అన్నారు. అందుకనే ఆయన పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఉండిపోయారని విమర్శించారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి దిగ్విజయ్ బరిలో నిలవగా  ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఉన్నారు. దిగ్విజయ్ ఓటు తన సొంత ఊరైన రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాఘోగఢ్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఆరో విడత ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

More Telugu News