mistery: కొడుకు చనిపోయాడనుకుని అంత్యక్రియలు నిర్వహించారు..రెండేళ్ల తర్వాత తిరిగొచ్చాడు!

  • ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి కనిపించపోవడంతో ఫిర్యాదు
  • గొల్లపల్లి జలాశయంలో శవం లభిస్తే అతడే అనుకుని అంతిమ సంస్కారం
  • అనంతపురం జిల్లా చెన్నైకొత్తపల్లి మండలంలో ఘటన

రెండేళ్ల క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి, అంతిమ సంస్కారం కూడా నిర్వహించిన వ్యక్తి కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? కానీ ఆ కుటుంబ సభ్యులకు ఇటువంటి అనుభవమే ఎదురు కావడంతో ఆనందం, భయం రెండూ ఒకేసారి కలిగాయి. అనంతపురం జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం హరేన్‌చెరువు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన తలారి శ్రీనివాసులు (38) రెండేళ్ల క్రితం అంటే 2017 మార్చి 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో తండ్రి ముత్యాలప్ప మార్చి 24వ తేదీన తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

వారం రోజుల తర్వాత గొల్లపల్లి మండలం పెనుగొండ జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఆ మృతదేహం శ్రీనివాసులదేమోనన్న అనుమానంతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి అది శ్రీనివాసులదేనని చెప్పడంతో పంచనామా పూర్తిచేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు శవాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఖననం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు.

కాగా, నాలుగు రోజుల క్రితం శ్రీనివాసులు ధర్మవరం పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో సంచరిస్తుండగా హరేన్‌ చెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి శ్రీనివాసులును తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తన పరిస్థితి బాగాలేక ఊరు వదిలి వెళ్లిపోయానని చెప్పాడు.

ఈ ఘటనపై శ్రీనివాసులు భార్య చిలుకమ్మ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం జలాశయంలో లభించిన మృతదేహం తన భర్తది కాదని అప్పట్లో తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని, తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని తెచ్చి ఖననం చేశామని కన్నీటిపర్యంతమవుతూ చెప్పింది. దీంతో శ్రీనివాసులు మిస్సింగ్‌ కేసు పరిష్కారమైనా అప్పట్లో రిజర్వాయర్‌లో లభించిన మృతదేహం ఎవరిదన్న ప్రశ్న మొదలయ్యింది.

More Telugu News