TMT: ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ ను అభివృద్ధి చేస్తున్న భారత్

  • హుబుల్ టెలిస్కోప్ కంటే 12 రెట్లు అధిక సామర్థ్యం
  • 2030 కల్లా నిర్మాణం పూర్తి
  • విశాల విశ్వంలో సుదూర ప్రాంతాలను వీక్షించే సౌకర్యం

ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్ నిర్మాణానికి భారత్ నడుంబిగించింది. థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) గా పేరుపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోప్ ను హవాయి దీవుల్లోని మౌనా కీ వద్ద అభివృద్ధి చేస్తున్నారు. ఈ టీఎంటీ ప్రాజక్టులో భారత్ కీలకపాత్ర పోషిస్తోంది. టీఎంటీ ప్రాజక్టులో అసోసియేట్ ప్రోగ్రామ్ డైరక్టర్ గా పనిచేస్తున్న ఏఎన్ రాంప్రకాశ్ ముంబయిలోని నెహ్రూ సైన్స్ సెంటర్ లో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ టీఎంటీ గురించి వివరించారు.

ఈ అతిపెద్ద టెలిస్కోప్ లో నియంత్రణ వ్యవస్థ, సాఫ్ట్ వేర్, ఇతర పరికరాలను భారత్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇది 2030 కల్లా నిర్మాణం పూర్తిచేసుకుంటుందని, ఈ టెలిస్కోప్ అందుబాటులోకి వస్తే విశాల విశ్వంలో సుదూర ప్రాంతాలకు మానవుడి దృష్టి పయనిస్తుందని, విశ్వానికి సంబంధించిన మరింత స్పష్టమైన చిత్రం కనిపిస్తుందని అన్నారు. కొన్ని భారత కంపెనీలు ఈ టెలిస్కోప్ లో ఉపయోగించే సెన్సర్లు, ఆక్చుయేటర్లు, మెకానికల్ సపోర్ట్ యంత్రాలు తయారుచేస్తున్నాయని ప్రకాశ్ వెల్లడించారు.

టీఎంటీ ప్రాజక్టులో అసోసియేట్ ప్రాజక్ట్  మేనేజర్ గా వ్యవహరిస్తున్న రవీందర్ భాటియా మాట్లాడుతూ, నాసా రూపొందించిన హబుల్ టెలిస్కోప్ కంటే ఈ భారీ టెలిస్కోప్ ద్వారా 12 రెట్లు స్పష్టంగా చూడొచ్చని చెప్పారు. కాగా, ఈ టీఎంటీ నిర్మాణం 18 అంతస్తుల భవంతి ఎత్తున ఉంటుందని సమాచారం. హవాయిలోని మౌనా కీ పర్వతంపై దీన్ని నిర్మిస్తుండగా స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News